Thathva Rahasyaprabha    Chapters   

శ్రీ మహాగణాధిపతయే నమః

ఏ క శ్లో కి

మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభయను

తాత్పర్య వివరణ సహితము.

శ్లో || శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం |

నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ||

శ్రీ శంకరాచార్యులవారు పరమానుగ్రహముతో అజ్ఞానముచేత స్వప్రకాశానంద స్వరూపమగు ఆత్మను తెలిసికొనలేక జీవుడననే భ్రమను పొంది, స్థూల సూక్ష్మకారణదేహములయందు అభిమానం కలవారై, ఆ దేహములయందలి ధర్మములను, అనగా కర్తృత్వము, భోక్తృత్వము, అజ్జత్వము, జన్మ, మరణం మొదలగు ధర్మములను, ఆత్మయం దారో పించుకొని దుఃఖమయమగు సంసారమందు నిమగ్నులై యెడతెగని ఘోర దుఃఖములను ననుభవించు జీవులను ఉద్ధరించుటకు, వేదాంతభాష్యములను అర్థంచేసికొనలేని వారికి కూడా శ్రమలేకుండా తెలియుటకు, వేదాంత స్తోత్రములను సమగ్రముగా తత్వముతెలియునటుల రచించిరి. ఈ వేదాంతస్తోత్రములలో కూడా ఒక్కొక్క స్తోత్రమునకు కొన్ని కొన్ని శ్లోకములున్నవి. ఆ శ్లోకములను కూడా అర్థంచేసికొనుటకు అలసులయినవారికి కూడా అతి సులభంగా తనలోనే తత్వం తెలిసికొనుటకు సౌకర్యముగా సర్వప్రపంచమును భాసింపచేయు పరమాత్మను బోధించుటకు ఏకశ్లోకిని వ్రాసిరి. ఈ శ్లోకముతోనే శరీరేంద్రియములకంటే వేరగు పరమాత్మ స్వరూపమును ప్రశ్న సమాధానరూపంగా ప్రతిపాదించిరి.

ఈ యేకశ్లోకికి మూలం ఉపనిషత్తులే. అందులే బృహదారణ్య కోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణమను ఒక భాగమున్నది. అందులో ఈ గాధయున్నది. జనకమహారాజు చాలా మహానుభావుడని ప్రసిద్ధమైన విషయమే. ఆయనకు యాజ్ఞవల్క్య మహర్షియందు చాలా భక్తికలదు ఒకప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి, జనకమహారాజు ఉభయులు సమావేశ##మై అగ్నిహోత్రవిషయంలో చర్చచేసిరి.

ఆ చర్యలో జనకమహారాజు అగ్నిహోత్రానుష్ఠాన విషయంలో చాలా బాగుగా సప్రమాణముగా చెప్పెను. అంతట యాజ్ఞవల్క్యమహర్షి జనకమహారు%ాజు చెప్పిన విషయమును విని చాలా సంతోషించి, జనక మహారాజా! నీవు చెప్పిన అగ్నిహోత్రానుష్ఠాన ఉపాసనావిషయం చాలా మనోహరంగా నున్నది. నీకేమికావలయునో వరమును కోరుమని చెప్పెను. అంతట జనకమహారాజు యాజ్ఞవల్క్య మహర్షిని స్వామీ! మీరు సర్వజ్ఞులుగనుక నేను యెప్పుడు యేప్రశ్న చేసినను విసుకుచెందక అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలయును. ఇదియే నాకు కావలసిన వరమని కోరెను.

అంతట యాజ్ఞవల్క్యులవారు చాలా సంతోషముతో నీవు యెపుడు యే ప్రశ్నజేసినను తప్పక సమాధానం చెప్పెదనని వరమిచ్చెను. అందుకు జనకమహారాజు చాలా సంతోషించి ఆ మాటను హృదయంలో పెట్టుకొని యుండెను. ఇట్లుండగా ఒకప్పుడు యాజ్ఞవల్క్యమహాముని జనకమహారాజు యోగక్షేమములను విచారించుటకైగాని, ఎన్ని ప్రశ్నలు చేసినను సమాధానం చెప్పగలనని వరమిచ్చియుంటిని. వెళ్ళి ఆయన అడిగితే చెప్పవలయుననిగాని, సంకల్పించి జనకమహారాజు దివ్యగృహమునకు వెళ్లెను.

యోగక్షేమములనగా, లేనిమంచి కలుగుట యోగము. ఉన్నమంచి సురక్షితముగా నుండుట క్షేమము, అంతట యాజ్ఞవల్క్య మహామునికి అర్ఘ్యపాద్యములనిచ్చి, దివ్యాసనమునిచ్చి నమస్కరించి కూర్చొనమనిరి. వారు సంతోషించి ఆ దివ్యాసనమందు సుఖముగా కూర్చొనిరి. యాజ్ఞవల్క్యులవారు మౌనముగానే కూర్చొనిరి.

ఎవరయినా మహాపెద్దలు గృహస్థులయిండ్లకు వచ్చినపుడు అర్ఘ్యపాద్యములిచ్చి అనగా కాళ్ళు చేతులు కడుక్కొనుటకు ఉదకమిచ్చుటగాని, లేక స్వయముగా వారి పాదములను కడుగుటకాని చేసి, ఆసనమిచ్చి కూర్చుండబెట్టి కూర్చున్నతర్వాత ఆ వచ్చిన పెద్దలు సంతోషపూర్వకముగా యేవిషయములనైనా చెపితే వినవలయునేకాని, ప్రశ్నలు చేసి వారికి శ్రమ కలుగచేయకూడదని సంప్రదాయమున్నను యాజ్ఞవల్క్యమహామునియే ప్రశ్నలు చేసినను సమాధానం చెప్పెదనని వరమిచ్చినందువలన జనక మహారాజే ముందుగా యాజ్ఞవల్క్యమహామునిని ప్రశ్నచేయనారంభించెను.

ఆ ప్రశ్న యేమనగా, మహానుభావా యాజ్ఞవల్క్య మహర్షీ! నాకు చాలా ఆశ్చర్యముగానున్నది ఒకవిషయం. ఆ విషయమును మీలాంటి మహానుభావులనే అడిగి తెలుసుకొనవలయునుగాని స్వయముగా తెలిసికొనుటకు శక్యముకాదుగనుక అడుగుచున్నానని వా రంగీకరించిన తర్వాత అడుగ నారంభించెను. ఏమనగా ఈ శరీరము కాళ్లు, చేతులు, శిరస్సు మొదలగు ఆకారముతోను, ఇంద్రియములతోను, కలిసియున్నది. ఇది తల్లిదండ్రులు భుజించిన ఆహారపదార్థములు జీర్ణమై తండ్రియందు శుక్ల రూపముగాను, తల్లియందు శోణితముగాను పరిణమించి తల్లిగర్భమందు రెండు కలసి శరీరముగా పరిణమించినట్లు, అనగా తయారయినట్లు క్రమముగా వృద్ధిపొందినట్లును, మాతృగర్భమునుండి బైటికివచ్చినతర్వాతకూడ పాలు మొదలగు భౌతికపదార్ధసారముచేతనే పెరిగినట్లును, శాస్త్రమును బట్టియు పెద్దలమాటలనుబట్టియు, అనుభవమునుబట్టియు తెలియుచున్నది.

గనుక ఈ శరీరం భౌతిక మనుటలో సందేహంలేదు. అందువలననే జడమని చెప్పుటలోకూడా సందేహంలేదు. ఇటువంటి శరీరం మాట్లాడుచున్నది, చూస్తున్నది, వింటున్నది, వెళ్ళుచున్నది, లౌకిక వ్యాపారములను వైదిక కార్యములను బాగుగా చేయుచున్నది. ఈ విధముగా చేయించు జ్యోతిస్సుయేది. ఈ శరీరమే స్వయముగా చేయుచున్నదా. దీనికంటే వేరుగా లోపల యేదైనా ఒక జ్యోతిస్సు అనగా చైతన్యం వుండి దీనితో ఇన్ని పనులు చేయించుచున్నాదా. లోకంలో ఒక బండి వెళ్ళుచున్నదంటే వెళ్ళేబండిని లాగుకొనిపోయ్యే యెడ్లుగాని, గుఱ్ఱములుగాని, తోలే వ్యక్తియు ప్రత్యేకముగా కనిపించుచున్నవి.

ఆధునిక ప్రపంచంలో కూడా సైకిళ్లు, బస్సులు, రైళ్లు, వెళ్ళుచున్నవంటే నడిచేవాటితో సహా నడిపేవారు కనిపించుచునే యున్నారు గనుక వీట్లలో ఆశ్చర్యంలేదు. గాని ఈ శరీర మిన్నిపనులుచేయుచున్నది ప్రవర్తించుచున్నదంటే యేది దీనికి విజ్ఞానమునిచ్చునది పనిచేయుంచునది. అది కనిపించుటలేదే. అందువలన శరీరమే స్వభావముగా చేయుచున్నదా! వేరుగా ఒకటియున్నదా. వేరుగానున్న దాని స్వరూపమేమియని జనక మహారాజు యాజ్ఞవల్క్యులవారిని ప్రశ్నించెను. అంతట యాజ్ఞవల్క్యులవారు శరీరేంద్రియములకంటే వేరుగానున్న ఆత్మస్వరూపమునే ప్రశ్నిచుచున్నాడని గ్రహించి, జాగ్రదవస్థకంటే స్వప్నావస్థయందు శరీరేంద్రియములు పనిచేయుటలేదు గనుక ఆ సమయమందు సర్వమును తెలియచేయు చైతన్యములేనిది స్వప్నానుభవము కలుగదు గనుక స్వప్నావస్థయందు చైతన్యస్వరూపమును ప్రబోధించి, అవస్థాత్రయాతీతమగు పరతత్వమును బోధించిరి.

కేనోపనిషత్తుకూడా ఒక తత్వజిజ్ఞాస కలిగిన శిష్యుడు బ్రహ్మవేత్తయైన సద్గురువును ప్రశ్నించినట్లు ప్రారంభించి గురువు సమాధానం చెప్పినట్లును పరమాత్మ తత్వమును ప్రబోధించినది. శంకరభగవత్పాదులవారు ఈ యుపనిషదర్థమునే ప్రశ్న సమాధానరూపముగా ఈ శ్లోకములో వ్రాసిరి.

శ్లో || కిం జ్యోతి స్తవభానుమా నహనిమే రాత్రౌ ప్రదీపాదికం

స్యాదేవం రవి దీపదర్శన విధౌ కింజ్యోతి రాఖ్యాహిమే

చక్షు స్తస్య నిమీలనాది విషయే కిం ధీర్థియో దర్శనే

కిం తత్రాహ మతోభవా న్పరమకం జ్యోతి స్తదస్మిప్రభో ||

ప్రతిపదార్థము.

కిం జ్యోతిస్తవ. తవ = నీకు, జ్యోతిః = ప్రపంచమును తెలియజేయు జ్యోతిః జ్యోతిస్సు అనగా చైతన్యము. కిం యేది అని ప్రశ్న. భానుమానహనిమేరాత్రౌ ప్రదీపాదికం, మే = నాకు, అహని = పగటియందు, భానుమాన్‌ = సూర్యుడు, రాత్రౌ = రాత్రికాలమందు, ప్రదీపాదికం = దీపం మొదలగు జ్యోతిస్సే అనగా పగటికాలమందు సూర్యుని వెల్తురువలన ప్రపంచమును చూచుచున్నాను, సూర్యుడు అస్తమించిన తర్వాత, రాత్రికాలమందు దీపములు వెన్నెల ఈ వెల్తురువలన పదార్థములను గుర్తించుచున్నాను. లోకములో వెల్తురులేనిది పదార్థములను గుర్తించుట, ఆయా పనులు చేయుట కుదరదు. గనుక, పగలు సూర్యుడనే జ్యోతిస్సు వెల్తురు వలనను, రాత్రి దీపములు, చంద్రుడు మొరదలగు వెల్తురువలనను అన్ని వ్యవహారములు అందరికి జరుగుచున్నవి. అటులనే నాకును జరుగుచున్నవని సమాధానం చెప్పెను.

స్యాదేవం రవి దీపదర్శన విధౌ కిం జ్యోతి రాఖ్యాహిమే, ఏవం = ఈవిధముగా, స్యాత్‌ = కావచ్చును, రవిదీపదర్శనవిధౌ = సూర్యునియొక్క, దీపముయొక్క, చూచుటయందు జ్యోతిః = వెలుగు, కిం = యేది, ఆఖ్యాహి = చెప్పుము, అనగా పగలు సూర్యునివలన ప్రపంచమును చూచుచున్నాము సరే, కాని, ఆ సూర్యునికూడా చూచుచున్నాముకదా. దేనిచేత సూర్యబింబమును, సూర్యుని వెల్తుర్ను చూచుచున్నాము. అటులనే రాత్రికాల మందు దీపముచేత, చందృని వెల్తురుచేతను ప్రపంచమును చూచుచున్నాము సరే. కాని, ఆ దీపమును, ఆచందృని వెల్తుర్ను దేనిచేత చూచుచున్నావు. వాటిని తెలియజేసే జ్యోతిస్సుయేది చెప్పుమని మరల ప్రశ్నించెను. మేచక్షుః మే = నాయొక్క, చెక్షుః = నేత్రేంద్రియము అనగా పగలు సూర్యుని చూచుటలోగాని, రాత్రి దీపములను, చందృని చూచుటలోగాని, నేత్రమే జ్యోతిస్సు. కళ్ళతోటే చూచుచున్నాముకదాయని భావముతో సమాధానం చెప్పెను.

తస్య నిమీలనాది విషయే కిం, తస్య = ఆ నేత్రముయొక్క నిమీల నాది విషయే = మూసికొనుట మొదలగు విషయమందు, కిం = ఏ జ్యోతిస్సు అనగా కళ్ళు మూసికున్నపుడుగాని, ఇంద్రియములు పనిచేయని స్వప్నావస్థయందుగాని, విషయములు తెలుసుకొను జ్యోతిస్సు యేదియని మరల ప్రశ్నించెను. ధీః బుద్ధియే. అనగా కళ్ళు మూసుకున్నపుడుగాని, ఇంద్రియములు పనిచేయని స్వప్నావస్థయందుకూడా ప్రపంచమును తెలుసుకొను నేత్రములను మూసికొన్నానని తెలిసికొనునదియు, బుద్ధియే. అనగా మనస్సేనని సమాధానం చెప్పెను.

ధియోదర్శనే. కిం, ధియః = బుద్ధియొక్క, దర్శనే = చూచుట యందు, కిం = ఏ జ్యోతిస్సు అనగా బుద్ధిచేత = బుద్ధివృత్తులచేత ఆయా పదార్థములను , విషయములను తెలిసికుంటున్నాము. సరేకాని ఇంటాంటి బుద్ధి నాకు కలిగినది. ఈ విషయం నాకు తెలిసినది, అని బుద్ధిని, తెలివిని తెలసికొనినది, బుద్ధి పనిచేయని సుషు ప్త్యవస్థయందు ఏమి తెలియలేదని అనగా విశేషజ్ఞానములేని స్థితిని తెలసికొను జ్యోతిస్సు యేదియని మరల ప్రశ్నించెను. తత్రాహం, తత్ర = ఆ బుద్ధిని తెలిసికొను విషయంలో అహం = నేను, అనగా బుద్ధిని తెలసికొనువాడను నేనే. అనగా ఆత్మచైతన్యమే. అనగా సాక్షిచైతన్యమేనని మరల సమాధానం చెప్పను.

అతోభవాన్‌ పరమకంజ్యోతిః తతః = ఈ కారణమువలన భవాన్‌ = నీవు, పరమకం = అతీతమగు, జ్యోతిః జ్యోతిస్సువు అనగా నీవే అన్నిటిని తెలుసుకొనుచున్నావు. సహజంగా లోకంలో అందరు తెలుసుకొనుటకు సాధనమగు సూర్యుడు, దీపములు, చందృడు, నేత్రము, బుద్ధి ఈ జ్యోతిస్సులను నీవే తెలసికొనుచున్నావు గనుక వీటికంటే అతీతమగు జ్యోతిస్స్వరూపుడవు నీవేనని చెప్పెను.

తదస్మి ప్రభో. హేప్రభో మహారాజా తత్‌ = ఆ సర్వప్రకాశ##మైన జ్యోతిస్స్వరూపుడను, అస్మి = అగుచున్నాను అనగా సర్వమును తెలియచేయు బుద్ధికి సాక్షియైన చైతన్య స్వరూపుడనే నేనని అనగా జీవునికంటే అతీమగు సాక్షిస్వరూపుడనే నేనని చెప్పెను.

తాత్పర్య వివరణం.

బృహదార్ణ్యకోపనిషత్తులో జనకమహారాజు యాజ్ఞవల్క్యమహర్షిని ఈ శరీరంలో యే జ్యోతిస్సు కలదు, యే జ్యోతిస్సు శరీరేంద్రియములను ప్రవర్తింపచేయుచున్నది, తెలుసుకొనుచున్నది యని. అనగా జ్యోతిః అను శబ్దముచేతనే జ్యోతిస్సునే ప్రశ్నచేసినట్లున్నది. యాజ్ఞవల్క్యమహర్షి జనకమహారాజు ప్రశ్నను బాగుగా అర్థంచేసికొని కూడా ఈ పురుషశరీరమునకు ఉపయోగించే జ్యోతియేదని జనకమహారాజు అడిగినను ఆత్మ జ్యోతిస్సునే చెప్పవలసియున్నను ముందుభౌతిక జ్యోతిస్సును గురించి చెప్పి. దానిమీద దోషదృష్టితో మరల ప్రశ్నచేసినయడల క్రమక్రమముగా ఆయా జ్యోతిస్సులను చెప్పుచు, చివరకు పరమాత్మ జ్యోతిస్సును చెప్పినయడల తత్వము బాగుగా విశదమగుననే ఆభిప్రాయముతో ముందుగా ఆత్మజ్యోతిస్సును చెప్పక సూర్యజ్యోతిస్సుచేతనే పగలు సర్వవ్యవహారములు జరుగుచున్నవిగనుక సూర్యుడే జ్యోతిస్సని సమాధానం చెప్పెను.

అంతట వారిమాటవిని జనకమహారాజు స్వామీ, ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత యే జ్యోతిస్సున్నది యని ప్రశ్నించెను. నాయనా, సూర్యుడు ఆస్తమించిన తర్వాత అనగా రాత్రి చందృడే జ్యోతిస్సు. ఆ చందృనివెల్తురువలననే పనులన్నియు జరుగుచున్నవని యాజ్ఞవల్క్యమహాముని సమాధానం చెప్పెను. అంతట యాజ్ఞవల్క్యమహర్షిని సూర్యుడస్తమించిన తర్వాత చందృడు కొంత సమయం ప్రకాశించును. ఆ చందృడుకూడా అస్తమిస్తే జ్యోతిస్సుయేది యని ప్రశ్నచేసెను. నిజమే నీవడిగినమాట, సూర్యచందృల వెల్తురు లేనపుడు అగ్నియే జ్యోతిస్సు, అనగా దీపాలు ఉన్నవికదా. చీకటిగా ఉన్నపుడు దీపాలు వెలిగించిపనులు చేసుకొందురుకదా. ఆ దీపములు లేకపోయినపుడు మణువైల్తురు మొదలగు వెల్తుర్లతో పనులు జరుగుతున్నవి యని సమాధానం చెప్పెను.

అంతట జనకమహారాజు స్వామీ, సూర్యుడు అస్తమించి చందృడు కూడా ఒక రాత్రివేళ అస్తమించి, దీపాలులేక అనగా చల్లారి ఇతరవెల్తుర్లు తటస్థించినపుడు జాగ్రదవస్థయందు అనగా నిద్రపోనంతవరకు జాగ్రదవస్థయే. రాత్రికాలంకూడా మేల్కొనిఉన్నయడల మేల్కున్న కాలమంతయు జాగ్రదవస్థగానే పరిగణించవలయును. పగలైనను నిద్రపోయిన సమయం జాగ్రదవస్థ కాదు.

ఏ జ్యోతిస్సులేని గాఢాంధకారంలో జ్యోతిస్సు యేమున్నదని ప్రశ్నించెను. అంతట యాజ్ఞవల్క్యమహాముని వాక్కే జ్యోతిస్సు, వాక్కనగా మాట. చిమ్మచీకట్లో ఎవరయినావుండి అయ్యా త్రోవలో నేనున్నాను తొక్కకుండా జాగ్రతగావెళ్ళండి, అంటే ఆవాక్కుజ్యోతిస్సు వల్లనే. తెలుసుకొని తప్పుకొని వెళ్ళుచున్నారు. చీకటిలో వెల్తురులేని సమయంలో మనుష్యులమాటలు, పశువులధ్వని విని ఇదియే గ్రామమని గుర్తించుట, మాటలనుబట్టి విషయములను తెలుసుకొనుట మొదలగువ్యవహారములు జరుగుచున్నవి గనుక వాక్కే జ్యోతిస్సని సమాధానంచెప్పిరి.

అంతట జనకమహారాజు సూర్యుడు అస్తమించి, చందృడు అస్తమించి, దీపములు కూడా శాంతించి, వాక్కుకూడా శాంతించినపుడు ఈ శరీరేంద్రియ సంఘాతమునకు జ్యోతిస్సు యేదియని ప్రశ్నించెను. అనగా ఇంద్రియములుకూడా పనిచేయని స్వప్నావస్థయందు జ్యోతిస్సు యేదని అభిప్రాయము. మరియు సూర్యుని ప్రకాశ##చేత కనబడేప్రపంచంకంటే, సూర్యుడు వేరుగానే యున్నాడుగాని, ప్రకాశింపచేయబడే పదార్థములలో చేరలేడు. అటులనే చందృడుకూడా వెన్నెలతో ప్రకాశింపచేయబడే పదార్థములకంటే వేరుగానున్నాడుగాని చందృని వెల్తురుతో ప్రకాశింపచేయబడే పదార్థములకంటే వేరుగానున్నవిగాని వాటిలో చేరవు. అటులనే శరీరేంద్రియ సంఘాతమందుకూడా అన్నింటిని తెలుసుకునే చైతన్యము తెలియబడేవాటికంటే వేరుగానున్నది. అది తెలియబడేవాటిలో చేరదు, అది యేదియనే అభిప్రాయముతో జనకమహారాజు ప్రశ్నించెను.

ఆ ప్రశ్నకు శరీరేంద్రియసంఘాతమందు నేత్రములు, శోత్రములు మొదలగు ఇంద్రియములు, మనస్సు చాలా ఉన్నవి. ఇన్నింటిలో యేది జ్యోతిస్సనీకూడా ప్రశ్నకు అభిప్రాయమే. యాజ్ఞవల్క్య మహాముని క్రమక్రమముగా సమాధానం చెప్పి, ఇంద్రియములు, మనస్సు వీటిలో ఇవియేవికావు, బుద్ధియందు బుద్ధి వృత్తులయందు ప్రతిబింబించుచు తదా కారమగుచు, సర్వమును తెలుసుకొనుచున్న జ్యోతిస్సు హృదయాన్తర్గతమైయున్నది. అదియే స్వప్నావస్థయందు యే యింద్రియములుపనిచేయక పోయినను యే సూర్యాది జ్యోతిస్సులు లేకపోయినను మనోవికారమగు స్వప్నప్రపంచము నంతను తెలుసుకొనుచున్నది.

అదియే ప్రధాన జ్యోతిస్సు ఆని సమాధానం చెప్పెను. ఇచట ఒక రహస్యమున్నది. తెలియబడేవాకంటే తెలిచేయునది వేరుగానున్నది, తెలియచేయబడే పదార్థములు లేకపోయినను తెలియజేయు చైతన్యము ప్రకాశించుచునే యుండునుగాని, ఆ చైతన్య జ్యోతిస్సు వెల్తురుకులోపము లేదు. విద్యారణ్య స్వాములవారు పంచదశీగ్రంథములో నాటక దీపప్రకరణంలో ఒక నృత్యశాలలో గొప్పదీపమున్నది. బాగుగా వెలుగుచున్నది. ఆ వెల్తురులో ఒక నాట్యం జరిగినది. నటికురాలుగాని, నాట్యశాలగాని, నాట్యమును చూచువారుగాని, నాట్యమును యేర్పాటుచేసిన ప్రభువునగాని అందరు అన్నియు ఆ నాట్యశాలయందలి దీపముచేతనే ప్రకాశింపచేయబడినవిగాని, వాటికి స్వయంగా ప్రకాశించే శక్తిలేదు. అందరు లేచిపోయినను యేవియు లేకపోయినను ఆ దీపము ప్రకాశించుచునేయుండును గాని, ప్రకాశింపబడేవి లేనంతమాత్రంతో ఆ దీపప్రకాశకు లోపంలేదు.

అటులనే ఆత్మజ్యోతిస్సుకూడా జాగ్రదవస్థయందు గాని, స్వప్నావస్థయందుగాని ప్రపంచవిషయములను బహిర్ముఖముగాను, అంతర్ముఖము గాను ప్రకాశింపచేయును, సుఘప్త్యవస్థయందు దృశ్యములు లేనంత మాత్రంతో ఆత్మజ్యోతిస్సుకు లోపంలేదు, ఆ యవస్థయందుకూడా అవిద్యను, ఆనందమును ప్రకాశింపచేయుచునే యున్నది. ఉపనిషత్తులు కూడా ద్రష్టయొక్క దృష్టికి లోపంలేదని అనగా దృశ్యము లేకపోయినను దృక్కుకు లోపంలేదని చెప్పుచున్నవి.

గనుక ఆత్మజ్యోతిస్సు కెప్పుడు లోపముడందనే తాత్పర్యం. ఈ ఏకశ్లోకియందు మొట్టమొదటనే జ్యోతియేమియని ప్రశ్నచేసినట్లున్నది. గనుక సర్వమును తెలియచేయు తత్వమును ప్రశ్నించినట్లే గ్రహించవలయునుకదా లోకంలోకూడా. జ్యోతిస్సనగా చీకటిని పోగొట్టి వస్తువులను ప్రకాశింపజేయు వెల్తురనియే అర్థము చెప్పవలయును జ్యోతి వెలుగుచున్నదనికూడా అంటారు. చీకటిని పోగొట్టి వస్తువులను తెలియచేయునదియే జ్యోతిస్సయినపుడు దీపము, సూర్యుడు, చందృడు మొదలగునవి కూడా జ్యోతిస్సులు కావచ్చును, కాని సూర్యుని దీపములను చూచుటకు జ్యోతిస్సు ఏదియని యడుగగా, చక్షుః = నేత్రమే జ్యోతిస్సని సమాధానం చెప్పిరి.

కాని సూర్యునివలనను, దీపంవలనను (చందృనివలనకూడా) చీకటిపోవుట, వస్తువులు కనిపించుట అనుభవములోనున్నదిగాని నేత్రము చీకటిని పోగొట్టలేదే, జ్యోతిస్సు ఎట్లగును అని ప్రశ్నించవచ్చును. చీకట్లో కళ్ళతో చూచినను చీకటిపోవుటలేదు. దీపంవెలిగిస్తేచీకటి పోవుచున్నది. సూర్యోదయమైనను చీకటి పోవుచున్నది. కాని నేత్రంవల్ల చీకటి పోవుట లేదుకదాయంటే ఒక నమాధానం.

నేత్రంవల్ల చీకటి పోకపోయినను నేత్రము సూర్యచందృలను, దీపములనుకూడా చూడగలుగుచున్నది. అనగా తెలియచేయుచున్నది. సరే, నేత్రమునకు తెలియజేయు సామర్ధ్యమున్నను చీకటిని పోగొట్టే సామర్థ్యం లేదే అంటే నేత్రము చీకటిని చూడగలుగుచున్నది. చీకటిని చూడనపుడు చీకటి కనిపించలేదుకదా. ఆ చీకటిని తేలియకుండా చేయు అజ్ఞానము కంటితోచూడగనే పోయిన చీకటి కనిపించుచున్నదిగనుక. నేత్రము మామూలు అంధకారమునకుకూడా అంధకారమగు అజ్ఞానాంధకారమును పోగొట్టి మామూలు అంధకారమును చూచుచున్నది గనుక, నేత్రము కూడా జ్యోతిస్సు కావచ్చునని సమాధానం చెప్పవచ్చును.

ఒకప్రశ్న, నేత్రం జ్యోతిస్సంటే జ్యోతిస్సు ఎట్లగుననిప్రశ్నిస్తే నేత్రము చీకటిని తెలియకుండాచేయు అజ్ఞానాంధకారమునునేత్రం పోగొట్టునన్నారే, అదేమిటి, స్పష్టంగాలేదంటే, సావకాశంగా విమర్శించండి, ప్రతిపదార్థము తెలియనపుడు అజ్ఞానముచేత ఆవరింపబడియున్నట్లే చెప్పవలయును. అజ్ఞానం చైతన్యమునే అవరించి, చైతన్యమందు కల్పితమైన పదార్థములనుకూడా తెలియకుండా చేయుచున్నది. అందువలననే యే వస్తువునుచూస్తే ఆ వస్తుజ్ఞానం కలిగి ఆ వస్తువునందలి యజ్ఞానంపోయి ఆ వస్తువు ఆ జ్ఞానంవల్ల తెలియుచున్నది.

సూర్యుడు తెలియనపుడు, సూర్యభాసక చైతన్యమును, అనగా సూర్యావచ్ఛిన్న చైతన్యమంటారు. అనగా సూర్యునికి అధిష్ఠానచైతన్యమన్నమాట. ఆ చైతన్యమును అజ్ఞానమావరించి సూర్యుని తెలియచేయకుండా చేయును. అటులనే దీపము తెలియనపుడుకూడా దీపావచ్ఛిన్న చైనతన్యమును అజ్ఞాన మావరించి దీపమును తెలియకుండా చేయును. సూర్యుని చూచినపుడు అంతఃకరణ సూర్యాకారాకారితమగునుకదా. అట్టి సూర్యాకారాన్తఃకరణ వృత్తి కలిగి ఆ వృత్తియందు చైతన్యం ప్రతిబింబిచిన తర్వాత ఆ వృత్తి వలన సూర్యావచ్ఛిన్న చైతన్యమందలి అజ్ఞానంపోయి ఆ చైతన్యముచేత సూర్యుడు తెలియజేయబడుచున్నాడు.

ఇటులనే దీపమును చూచినపుడు దీపాకారాన్తఃకరణ వృత్తి కలుగును, ఆ వృత్తివలన దీపావచ్ఛిచ్న చైతన్యమందున్న అనగా దీపాధిష్ఠాన చైతన్యమందున్న అజ్ఞానావరణ నశించును. అప్పుడు వృత్తి యందు ప్రతిబింబించిన చైతన్యముచేత ఆ దీపము తెలియచేయబడును. అంధకారమును చూచినపుడు అంధకారాకారాన్తఃకరణ వృత్తికలుగును. ఆ వృత్తివలన అంధకారం తెలియనిదశలో నున్న అంధకారాధిష్ఠాన చైతన్యమందున్న అజ్ఞానావరణ నశించును. అంధకారాకారా న్తఃకరణవృత్తి యందు ప్రతిబింబించిన చైతన్యముచేత అంధకారం అనగా చీకటి తెలియబడును.

గనుక కన్ను తెరచి చూచినపుడు అజ్ఞానాంధకారం పోవుచున్నది గనుక నేత్రముకూడా అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నదిగదా అందుచేత అజ్ఞానమునుపోగొట్టుట, సూర్యునిగాని, దీపమునుగాని, చీకటినిగాని తెలుసుకొనుట నేత్రమువల్లనే జరుగుచున్నవి గనుక నేత్రమును జ్యోతిస్సనవచ్చును కదా యనిసమాధానం చెప్పవచ్చును. గాని దానిమీదకూడా ఇట్లు ప్రశ్నించవచ్చును ఎటులననగా కంటితోచూస్తే అజ్ఞానాంధకారంపోతుందన్నారుగాని, కంటితో చూచినంతమాత్రంతో అజ్ఞానావరణ పోదు. నేత్రముద్వారా అంతఃకరణ వెళ్ళి తదాకారవృత్తినిపొందినతర్వాత ఆ వృత్తియందు చైతన్యం ప్రతిబింబిస్తే, ఆ వృత్తివలన అజ్ఞానావరణ పోవునుగాని నేత్రం వల్లకాదు అంటే నిజమే.

అజ్ఞానాంధకారమును పోగొట్టు జ్ఞానం కలుగుటకు నేత్రం ద్వారమైనది. అనగా సాధనమైనదిగాని అజ్ఞానమును పోగొట్టలేదు. పోనివ్వండి అజ్ఞానమును పోగొట్టకపోయినను, వస్తువులను ప్రకాశింపచేయునా అంటే, ప్రకాశింపచేయడమేమని నీ యభిప్రాయం. ప్రకాశింపచేయడమనగా తెలియచేయడమని నా యభిప్రాయం. తెలియచేయునది తెలివేగాని మరియొకటికాదు, తెలివనగా నేమి? యే వస్తువును చూస్తమో, తెలుసుకుంటామో, ఆ వస్త్వాకారవృత్తియందు ప్రతిబింబించిన చైతన్యమే. అదియే జ్ఞానం, ఆ జ్ఞానమే అన్నిటినీ తెలియచేయుచున్నది. అదియే ఆత్మకూడా

ప్రత్యక్షప్రమాణములవలన అనగా యింద్రియములవలన జ్ఞానం కలుగుననియు, అమమాన ప్రమాణంవలన జ్ఞానంకలుగుననియు, ఉపమాన ప్రమాణంవలన జ్ఞానంకలుగుననియు, శబ్దప్రమాణంవలన జ్ఞానంకలుగుననియు, యింకా యితరప్రమాణములవలన కూడా జ్ఞానం కలుగునంటారుకదా. అంటె ఈ ప్రమాణములవలన జ్ఞానం కలుగదు. జ్ఞానమనగా చైతన్యము. అది నిత్యము. దానికి ఉత్పత్తిలేదంటే ప్రమాణములకు ప్రయోజనమేమి? ఆ చైతన్యమును ప్రతిబింబింపచేయు ఆయావస్త్వాకార వృత్తులు కలుగుటయే ప్రమాణములకు ప్రయోజనం.

ప్రమాణములవలన కలిగిన మనోవృత్తులయందు చైతన్యం ప్రతి బింబించిన అదే జ్ఞానంకదా ఆ వృత్తులను కలుగచేసినందువలననే ప్రమాణములు ప్రమాణము అంటారు, అయితే ప్రమేయములను అనగా వస్తువులను గుర్తించునది ఏది అంటే ప్రమాతమే. ప్రమాతయనగా చైతన్యస్వరూపుడే. ప్రమాణములు. ప్రమాతకు ప్రమేయములను తెలిసికొనుటలో సాధనములేగాని, ప్రమేయములను భాసింపచేయునవి కావని చైతన్యమేభాసింపచేయునదని తేలినది. నిజమే చైతన్యప్రకాశ##చేతనే సర్వం ప్రకాశించుచున్నదని శృతి చెప్పుచున్నది కూడా.

సరే ఆవిషయ మట్లావుంచండి. సూర్యునివలనను, దీపంవలనను చీకటి పోవడం ప్రకాశించడమనగా అర్థమేమి? దీపంవలన, సూర్యుని వలన మామూలుచీకటి పోవుచున్నది. చీకటిపోయినతర్వాతకూడా అజ్ఞానమనే చీకటి వస్తువులను ఆవరించియే యున్నది. ఆ యజ్ఞానమనే చీకటిని దీపాలు, సూర్యుడు మొదలగు వెల్తుర్లు పోగొట్టజాలవు. చూచేవానిదృష్టి ప్రసారంకావాలి. అంతఃకరణవిషయములమీదికి పోవాలి. తదాకారవృత్తి కలగాలి. ఆ వృత్తియందు చైతన్యం ప్రతిబించాలి. ఆ చైతన్య ప్రతిబింబింతో కూడుకున్న వృత్తివలన అజ్ఞానావరణ పోవాలి. ఆ చైతన్యం చేత ఆ వస్తువులు తెలియబడవలె. అంతేగాని మామూలు వెల్తురువల్ల మామూలు చీకటి పోయినంతమాత్రంతో, అజ్ఞానాంధకారం పోవుటకు చైతన్యం ప్రతిబింబించుటకును అనుకూలమగు తెలుసుకున్నే వాని ప్రమాణములతో మనోవృత్తిలేకుండా చైతన్యప్రకాశ##లేకుండా ఏదీ తెలియదని తేలుచున్నదికదా.

అంటే నిజమే. జ్యోతిస్సు అని జ్ఞానరూపమగు ఆత్మనే ముఖ్యముగా అనవలయునుగాని సూర్యాదులనుకూడా ముఖ్యముగా జ్యోతిస్సనడానికి వీలులేదని తేలుచున్నదంటే నిజమే. పరప్రకాశ్యంకాని అనగా ఇతరముతో తెలియచేయబడని స్వప్రకాశస్వరూపము ఆత్మచైతన్యమేగాని మరియొకటి కాదు గనుకనే ప్రపంచమును తెలియచేయునవి సూర్యుడు, దీపాదు లనే జ్యోతిస్సుఅని, సూర్యుని దీపాదులను తెలియజేయుజ్యోతిస్సు నేత్రమని, దానిని తెలియిజేయు జ్యోతిస్సు బుద్ధియని, దానిని తెలియజేయు జ్యోతిస్సు ఏదనగా భవాన్‌ పరమకం జ్యోతిః అని. నీవే పరజ్యోతి స్వరూపుడవని చెప్పినట్లున్నది. నీవు పరమాత్మ స్వరూపుడవేనని, తత్వమసి యను మహావాక్యార్థమును చెప్పినట్లయినది. తరువాత తదస్మి ప్రభో అని చెప్పిరి. ఆ జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మస్వరూపుడు నగుచున్నానని అహంబ్రహ్మాస్మియను మహావాక్యమునకు లక్ష్యార్థమగు పరమాత్మ స్వరూపుడనే నేనని చివర చెప్పిరి గనుక మహావార్యలక్ష్యమగు పరబ్రహ్మయే పరమకం జ్యోతిః అని జ్యోతిశ్శబ్దముచేత చెప్పబడినదని గ్రహించవలయును.

అయితే సూర్యునివలె. దీపమువలె చక్షుస్సు చీకటిని పోగొట్టదు గదా జ్యోతిస్సు అని. నేత్రమును ఎట్లా అనవలయునను ప్రశ్నకు సమాధానమేమంటే, ఈ శ్లోకమునకు పరమతాత్పర్యం పరమాత్మ రూపమగు జ్యోతిస్సును చెప్పుటయందే గనుక దానికి అనుకూలముగా లోకవ్యవహారములను బట్టి కొన్ని పదార్థములను తెలియజేయు సూర్యుడు, దీపము, చందృడు, నేత్రములు, బుద్ధియుకూడా జ్యోతిస్సనే చెప్పబడినవి. గనుక అన్నిటికిని చీకటినిపోగొట్టి ప్రకాశింపచేసే లక్షణ ముండవలయునని ప్రకాశ్నించ నవసరంలేదు. తెలియజేయునవియనే అర్థమును గ్రహించవలయును.

ఈ ఏకశ్లోకియందు ఒకరు ప్రశ్నించినట్లును, ఒకరు సమాధానం చెప్పినట్లును యున్నది గనుక ప్రశ్నించిన దెవరు; సమాధానం చెప్పిన దెవరంటే బృహదారణ్యకోపనిషత్తులోని జ్యోతిర్ర్బాహ్మణమే ఈ యేకశ్లోకికి మూలముగా కనిపించుచున్నది గనుకను, చివర తదస్మి ప్రభోయని కూడా యున్నది గనుకను, జనక మహరాజు ప్రశ్నించినట్లును. యాజ్ఞవల్క్యులవారు సమాధానం చెప్పినట్లును మనం గ్రహించవచ్చును. ఉపనిషత్తులలోని ప్రశ్న సమాధానములకును, ఈ శ్లోకంలోని ప్రశ్నా సమాధానములకును కొద్దిగా తేడాయున్నను చాలాభాగం ఐక్యమున్నది గనుకను తాత్పర్యము బాగుగా పరిపోవుచున్నది గనుకను, ఏకశ్లోకికిని, జ్యోతిర్ర్బాహ్మణమునకును ఐక్యము గుదురుచున్నది.

ఈ యేకశ్లోకియందు రెండు మహావాక్యముల యర్థమున్నట్లు స్పష్టమగుచున్నది. మహావాక్యములకు లక్ష్యమగు పరమాత్మయే ఇచట జ్యోతిశ్శబ్దమునకు లక్ష్యమనికూడా గ్రహించవచ్చును. నీవే పరమజ్యోతిస్సువన్నట్లు, అనగా అన్నింటినీ తెలుసుకున్నేవాడవు నీవేనన్నట్లు. అటులనే నేను ఆ జ్యోతిస్స్వరూపుడనే నన్నట్లుకూడా యున్నది గనుక, సర్వమును ప్రకాశింపజేయు స్వయం జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మస్వరూపుడు నేనేనని బ్రహ్మసాక్షాత్కారమును సంపాదించి ముక్తులు కావలయునని తాత్పర్యము.

ఒక శ్లోకమైనను మహావాక్యమువలె జీవునికి పరమాత్మతో నైక్యమును బోధించినది గనుక ఈ యేకశ్లోకిని అందరు చదివి కంఠస్థముచేసి ప్రతిపదార్థమును, తాత్పర్యవివరణమును బాగుగా చదివి శంకరాచార్యుల వారి హృదయమును కనుగొనవచ్చును. వేదములలో ఉపనిషత్తులు పరమాత్మ తత్వమును బోధించునవిగనుక ప్రధానములు. ఆ ఉపనిషత్తులలో కూడా మహావాక్యములు సాక్షాత్తుగా జీవబ్రహ్మైక్యమును బోధించునవి గనుక చాలా ప్రధానమైనవి. అట్టి మహావాక్యములయొక్క అర్థమును చెప్పిన ఏకశ్లోకి విలువను యెంతగా గ్రహించవలయునో వేరే చెప్పనవసరం లేదు, ఈ శ్లోకంక్రింద చాలామటుకు విశదముగానే వ్రాసితిని. మరీ శాస్త్రచర్చలను వ్రాసిన క్లేశముగా నుండును గనుక తేలికగా సారమును వ్రాసితిని, తేలికభాషలోనే శాస్త్రచర్చనుకూడ వ్రాసితిని గనుక విడచిపెట్టినట్లు భావించనవససరంలేదు.

అద్వైతమతమంటే ఏమిటో ఆ తత్వము యేయే స్తోత్రముల యందు యెటుల చెప్పబడినదో అదైత ప్రతిపాదన ఏవిధముగా చేసిరో జ్ఞానమునకును, అజ్ఞానమునకును భేదమేమో, వ్యవహారదశకును, పరమార్థ దశకును, భేదమేమో, జీవేశ్వరులకు భేదమేమో, సాక్షికి; జీవునికి భేదమేమో, బంధమోక్షములకు భేదమేమో అవస్థాత్రయమునకు పరస్పరం భేదమేమో అన్నియు ఈగ్రంథమందుముద్రింపబడిన శంకరాచార్యస్వాముల వారు వ్రాసిన వేదా న్తస్తోత్రములను బాగుగా చదివి ఈ స్తోత్రములకు వ్రాసిన తెలుగు టీకాతాత్పర్య వివరణలను బాగుగా చదివినయడల సులభముగాను, స్పష్టమ గాను తెలిసికొనవచ్చును, ఇదియేగాక అద్వైతసిద్థాన్త మంతయు ఈ పుస్తకమును బాగుగా చదివినయడల కరతలామలకమువలె స్పష్టముగా తెలియుననే విషయం సహృదయులు చదివి గ్రహింతురు గనుక యింతకన్న చెప్పనక్కరలేదు.

ఇట్లు శంకరాచార్య విరచితమగు ఏకశ్లోకిపై

మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభయను తెలుగు

టీకాతాత్పర్య వివరణం సమాప్తం.

శ్రీః శ్రీః శ్రీః

గ్రంథము పరిసమాప్తము

Thathva Rahasyaprabha    Chapters